Saturday 10 December 2016

జీరో పిలక

 అంటే ఏమిటి అనేకదా! చెప్తా!! దీనికి కూడా ఉపోద్ఘాతం ఉంది మరి, ముందు అది చెప్పి తరువాత ఇది చెప్తా!
అవునండి ఇది మా పాప  కనిపెట్టిన కొత్త పదం,
అందరూ  ఒక పిలక రెండు పిలకలు వేసుకుంటారు కదా! అలాగే మా పాపకు కూడా ఒక పిలక రెండు పిలకలు వేస్తుంటా! ఈ మధ్య దాని జుట్టు కొంచెం పెరిగాయేమో స్నానం చేయిస్తున్నప్పుడు తడుస్తున్నాయి. మరి ఏమి చేస్తాం, వానిని మడచి పిలకలా పెట్టటం మొదలు పెట్టాను. అదిగో దాని పేరు జీరో పిలక.
జీరో ఎందుకంటే అది చూడటానికి జీరో లా ఉంటుంది కదా అందుకని పాపం.

Saturday 12 November 2016

మళ్ళీ వస్తున్నా,... వచ్చేస్తున్నా

ఈ మధ్య మరో వ్యాపకం మొదలయింది కదా! అందుకే బ్లాగు లకు సమయం దొరకటం లేదు. కానీ మనస్సు లాగేస్తుందనుకోండి. అందరు ఎలా ఉన్నారు? నేను రాయటం లేదు కానీ మీరందరూ  రాసేవి చూస్తూనే ఉన్నాను.
ఇకమీద ఇలా  మరీ కనిపించకుండా ఉండకూడదని ప్రయత్నిస్తాను. 

Thursday 28 July 2016

నాకోటి, నాన్నకోటి... మరి సోమికి?

సోమికి అంటే ఏమిటి అనేగా! మా అమ్మాయి భాషలో సోమి అంటే స్వామి/ దేవుడు అని అర్ధం. ఇంతకీ ఏమి అడిగినది అనేనా! చెప్తున్నాచెప్తున్నా!
ఉదయాన్నే లేచి ఇడ్లి స్టవ్ మీద పెట్టి పాపను లేపటం మొదలు పెట్టాను. తనని లేపి, పళ్ళు తోమించి స్నానం చేయించే సరికి వాళ్ళ నాన్నగారు కూడా మరో బాత్రూమ్ లో స్నానం ముగించుకుని బయటకు వచ్చారు. పాపకి బట్టలు వేసే లోపు ఆయనగారు పూజ సామానులు కడుగుకున్నారు. కడిగిన ఆ సామానులను తుడవడంలో మా పాప మా వారికి సహాయం చేస్తుంది. ఒకవేళ ఆయన చేయనివ్వకపోతే గొడవ చేస్తుంది. అది అలా దేవుని గదిలోనికి వెళ్ళగానే నేను తిరిగి వంటింట్లోకి వెళ్ళాను. ఇడ్లి  దించి పాలు పెట్టాను. ఇంతలో పాప సహాయం చేయటం అయిపొయింది. తిరిగి నాదగ్గరకు వచ్చింది. తనకి ఇడ్లి పెట్టి ఇచ్చాను. అమ్మా ఇంకొకటి ఇవ్వు అంది. అబ్బో ఈ రోజు రెండు తింటావా అనుకుంటూ అదే ప్లేటులో పెట్టబోతే వద్దు అని మరో ప్లేట్ తెచ్చింది. సరే బాగుంది అనుకుని పెట్టాను. మళ్ళీ  ఇంకొకటి అడిగింది. ముందు ఇది తిను మరొకటి పెడతాను అని చెప్పను. కాదు మూడో ప్లేట్ తెచ్చి నాముందు పెట్టి దీనిలో పెట్టు అంది. నాకు అర్ధం కాలేదు. నేను ఇప్పుడు తినను, ముందు నువ్వు తిను అని చెప్పేలోపల వాళ్ళ నాన్న సాయి చాలీసా మొదలు పెట్టారు.  అప్పుడు చెప్పింది ఆ మాట "నాకోటి, నాన్నకోటి... మరి సోమికి?". సరే అని ఒక ఇడ్లి ప్లేట్లో పెట్టి, పంచదార వేద్దామనుకున్నాను! మల్లి మరో మాట చెప్పింది. "నాన్న రోజు సోమికి పంచదార పెడతారు, ఈ రోజు చట్నీ పెడదాం! సోమికి చాలా ఇష్టం." అలా ఆ రోజు మా దేవునికి ఇడ్లి నైవేద్యం పెట్టాం! 

Tuesday 12 July 2016

అనగనగా ఒక రోజు - ప్రతి రోజు

ఏవండీ! మన పాప పుట్టిన రోజు వచ్చే నెలలో వస్తుంది కదా, దానికి ఒక సైకిల్ కొందామండి.
వచ్చే నెలలో కదా! అప్పుడు చుద్దాం!
*    *     *     *
ఏవండీ! పాప పుట్టిన రోజు వస్తుంది కదా! సైకిల్…
చూద్దాం!
*    *     *     *
ఏవండీ! దాని పుట్టిన రోజుకు కొందామనుకున్న సైకిల్ ఇప్పుడయినా తీసుకుందాం!
ఇప్పుడా! వచ్చే నెల జీతం రాగానే చుద్దాం!
*    *     *     *
ఏవండీ! ఫలానా షాప్ లో సైకిళ్ళు 50%  ఆఫర్ నడుస్తుందట, వెళ్దామండి.
అబ్బా వాడు అలాగే చెప్తాడు. పాత ష్టాకు ఉంటుంది. మనం చక్కగా కొత్తది కొనుక్కుందాం!
*    *     *     *
ఏవండీ! ఆ షాప్ లో ఆఫర్ అయిపొయిందట. ఇప్పుడు వెళదామా!
మొన్ననేకదా ఆఫర్ ఐపోయింది, పాత ష్టాకు అయిందో లేదో? వచ్చే నెల చుద్దాంలే!
*    *     *     *
ఏవండీ! ఈ నెలలో అయినా దాని సైకిల్…
అదికాదోయ్! మా నాన్నకు చెప్పాను  సైకిల్ తీసుకొవాలని. మన వూరిలో ఫలానా షాప్ మనకు బాగా తెలిసిన వాళ్ళది, అక్కడ తీసుకుందాం అన్నరు  మా నాన్న. ఈ సారి మనం వూరికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం!
*    *     *     *
హలో, ఏవండీ! వినిపిస్తుందా! ఆ .. వచ్చేటప్పుడు దాని సైకిల్….. అదే తెలిసిన షాపు ఉంది అని … ఆ ఒకసారి ..
మానాన్నకు ఉన్న సైకిల్ నచ్చలేదంట, మళ్ళీ ష్టాకు వచ్చినప్పుడు మంచిది తెమ్మని చెప్పారంట.

ఏవండీ! వచ్చే నెలలో పాప పుట్టిన రోజు వస్తుంది. కనీసం ఈ సారయినా దాని సైకిల్…

నాన్న చెప్పరు కదా షాప్ వాళ్ళకి, వాళ్ళు ఇంకో రెండు నెలలలో కొత్త ష్టాకు తెస్తారట. అప్పుడు చుద్దాం.

Tuesday 21 June 2016

"వాలి" గోల


వాలి అంటే రామాయణంలో పాపం సుగ్రీవుని అన్నగారు వాలి కాదు, అబ్బే అజిత్ ద్విపాత్రాభినయం చేసిన వాలి కూడా కాదండి బాబు. ఇది తెలుగు భాష లో ఒక పదం "వాలి". దీని గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటారా! ఈ మధ్య మా పాప ఈ పదం ఎక్కువగా వాడుతుంది. మనం కూడా వాడతాం కదా అనకండి, చెప్తా చెప్తా మొత్తం చెప్తా.
మా పాప మొదటి పలుకులు పలికినది మలేషియాలో! గొప్ప కాకపోతే ఆ విషయం ఇప్పుడెందుకు చెప్పటం అనుకోకండి, అక్కడే ఉంది అసలు విషయం. మనం వాడుకలో ప్రతి మాట చివరలో అవసరం కాకపోయినా దీర్ఘం చేరుస్తాం కదా , అలాగే మలయ (మలేషియా భాష) లో వారు "లా" చేరుస్తారు. ఉదాహరణకి "your baby is soo cute laa". "థిస్ బస్ గోస్ థేర్ లా", అలా అనుకోని అతిథి"లా" ఈ "లా" మా పాప భాషలో చేరింది.  ఎప్పుడు ఇంటికి వచ్చినా దాని వచ్చిరాని మాటలను ముద్దుగా వింటూ అది ప్రతి మాటకు "లా" చేరుస్తుంటే మేము ఆనందించాం.
తరువాత మొత్తానికి మన దేశమునకు తిరిగి వచ్చేసాక పాపం మా పాప భాషా కష్టములు మొదలయ్యాయి. 
అందులో మనభాషలో "వాలి" పదం చివరన ఉండే పదములు దానికి బాగా నచ్చాయి. ఉదాహరణకు "కూర్చోవాలి, చదువుకోవాలి,తెచ్చుకోవాలి" అంతే "లా" వదలి "వాలి" పట్టుకుంది. కొన్ని మాటలు వినటానికి కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా  కొన్నింటిని అర్ధం చేసుకోవటానికి మాత్రం సమయం పడుతుంది.
మా పాప పలికే కొన్ని మాటలు :  ఇవ్వ "వాలి", అన్నం పెట్టు "వాలి", తిను "వాలి", నిద్రలేపు "వాలి", అబ్బో ఇలాంటి వి ఎన్నో.

Tuesday 19 April 2016

స్నానం చేయకుండా "ఓం" పెట్టుకోవచ్చా!

మాపాప దానికి వచ్చే నెలలో 4వ పుట్టినరోజు వస్తుంది. ABCD లు రాస్తుంది, ఒంట్లు (అదేనండి తెలుగులో నెంబర్సు ) 100 రాస్తుంది.   ఇక పూజల విషయంలో మరీ అధ్బుతం. హనుమాన్ చాలీసా దగ్గరి నుండి సాయి చాలీసా, కనక ధారా స్తోత్రం అన్నీ చక్కగా చెప్తుంది.రోజూ మా వారు పూజ చేస్తున్నప్పుడు తను పక్కనే ఉంటుంది. ఆయనగారు ఏదయినా శ్లోకం తప్పు చదివినా, రోజూ చదివే వరుస తప్పించి మరోలా చదివినా అంతే పిర్యాదు చేస్తుంది. సాయి చాలీసా చక్కగా ఇద్దరూ కలిసి చదువుతారు. తరువాత హనుమాన్ చాలీసా తనే చదవాలి. పుస్తకం ఒడిలో పెట్టుకుని చదువుతూ పేజీలు  తిప్పుతుంది. చూసే వాళ్లకి నిజంగా పుస్తకం చూసి చదువుతుంది అనిపించేలా. తనకు ఇంకా తెలుగు చదవటం రాదు.
ఈరోజు పాప కొంచం ఆలస్యంగా లేచింది. అప్పటికి మావారి పూజ అయిపోయింది. కనుక తను గదిలో నుండి బయటకు రాగానే మావారు దేవునికి "ఓం" (నమస్కారాన్ని తను అలాగే అంటుంది)  పెట్టుకో వెళ్లి అని చెప్పారు. అయిష్టంగా మొహం పెట్టుకుని లోపలికి  వెళ్ళింది. బయటకు వచ్చి వాళ్ళ నాన్నగారితో "నాన్న! స్వామి నన్ను స్నానం చేసి 'ఓం' పెట్టుకో మన్నాడు. స్నానం చేయకుండా పెట్టుకోవచ్చా! నువ్వు అలాగే పెట్టుకున్నావా ఈ రోజు?"
తన మాటలు వింటున్న మాకు ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు. తరువాత తేరుకుని, తనని స్నానం చేయించాను.
ఇంతకీ తనకు ఏ స్వామి స్నానం చేయమని చెప్పాడో అడిగే సాహసం మేము చేయలేక పోయాం!

Monday 7 March 2016

లోక జ్ఞానం

ఈ మధ్య నా  తేటలు లోక జ్ఞానం గురించి మా పక్కింటి పుల్లమ్మ పొగిడింది. అప్పటి నుండి మీ అందరితో నా సంతోషం పంచుకోవాలని  తొందరగా ఉంది. మీకు కూడా లోక జ్ఞానం గురించి ఏమయినా సందేహాలుంటే నన్ను అడగండి సుమా! ఇంతకీ ఆమె ఆ మాట ఎందుకు అందో చెప్తాను.
ఒక రోజు నేను నా పని చేసుకుని బట్టలు ఆరబెడుతుంటే పుల్లమ్మ వచ్చింది.
పుల్లమ్మ: ఏంటో వదినా ఈ మగవాళ్ళు వారం రోజులు ఇంట్లోనే ఉంటాం కదా మనం, వారానికి ఒక్కరోజు బయటకు తీసుకు వెళ్ళమంటే విసుక్కుంటారు.
నేను: ఎం వదినా! నిన్ను అన్నయ్య ఎక్కడికీ తీసుకువెళ్ళడా?
పుల్లమ్మ: ఎం తీసుకు వెళతాడులే, ఏదో నెలకి ఒకసారి, ఆదీ నీను బాగా గొడవ చేస్తే. ఎం వదినా అలా అడిగావ్? మీరు ఎప్పుడూ వెళుతూనే ఉంటారేమిటి?
నేను: మీ అన్నయ్య నన్ను కనీసం వారానికి 2 రోజులయినా బయటకు తీసుకు వెళతారు వదినా
పుల్లమ్మ: అబ్బ ఎంత అదృష్టమో నీది. అయితే ఈ చుట్టూ పక్కల చూడవలసినవి అన్నీ చూసే ఉంటారు కదా!
నేను: అబ్బే అదేం లేదు వదినా! ఎప్పుడు వెళ్ళినా ఒక్కదగ్గరకే తీసుకు వెళతారు.
పు: అదేంటి? ఒకే దగ్గరకు అన్నిసార్లు ఎందుకు వదినా?
నే: అలా  మళ్లీ మళ్లీ వెళితేనే అతనికి మనం గుర్తుంటామట. అప్పుడే మనకు చౌకగా ఇస్తాడట కూరగాయలు.
పు: కూరగాయలా?
నే: అవును కూరగాయలే! నువ్వు ఎం అనుకున్నావ్?
పు: అయితే మీరు వారానికి రెండు రోజులు బయటకు వెళ్ళేది కూరగాయల కోసమా!
నే: అవును. అంటే కూరగాయలే కాదు, అప్పుడప్పుడు పాల ప్యాకెట్ కూడా తెచ్చుకుంటాం!
పు: సరేలే. అయితే మీరిద్దరూ ఎక్కడికీ వెళ్ళరా?
నే: ఎందుకు వెళ్ళం? నెలకి ఒకసారి సరుకులు తెచ్చుకోవటానికి, పండగలప్పుడు బట్టలు కొనుక్కోవటానికి వెళతాం.
పు: బాగానే ఉంది. అయితే మీరు ఎప్పుడూ బయట తినలేదా?
నే: ఎందుకు తినం? ఆయనకి ఆరుబయట తినటం అంటే ఎంత ఇష్టమో!
పు: అదికాదు! మీరు బయటకి అంటే పార్కుకు అలా ఎప్పుడూ వెళ్ళరా?
నే: ఎందుకు వెళ్ళం? కార్తీక మాసంలో వన భోజనాలకి వెళతాం కదా!
పు: అంటే కానీ మీరు ఎప్పుడూ పార్కుకు కూడా వెల్ల లేదా?
నే\: ఊరుకో వదినా! నువ్వు మరీ, మా పెళ్లి అయిన కొత్తలో మన వెనుక సందులో ఒక పార్కు ఉంటుందే దానికి ఒకసారి తీసుకెళ్ళారు మీ అన్నయ్య.
పు: అబ్బో! ఇంకెక్కడికి వెళ్ళలేద?
నే: అయ్యయ్యో మరచిపోయాను. మొన్న మధ్య జూ పార్కు కు కూడా వెళ్ళాం. ఒక రోజంతా తిరిగాం.
పు: మరి ఆరోజు అక్కడ ఏమి తినలేదా?
నే: ఎందుకు తినలేదు! మీ అన్నయకు టైం కు తిండి ఉండాలి. ఆ రోజు పులిహోర తిన్నాం.
పు: మరి ఎలావుంది ఆరోజు పులిహోర?
నే: ఎలా వుంటుంది! బాగానే ఉంది. నేను ఎప్పుడు చేసినా పులిహోర మా వారు లొట్టలేసుకుంటూ తింటారు.
పు:  ఏంటి? ఆ పులిహోర నువ్వే చేశావా?
నే: అవును మేం ఎప్పుడయినా బయటకు వెళుతుంటే ఉదయానే లేచి వంట చేసి తీసుకెళతాం
పు: అయితే నువ్వు ఇప్పటి వరకు బయట తిననే లేదా!
నే : అదేంటి వదిన మల్లి అడుగుతావ్? ఇందాక చెప్పా కదా ఆరుబయట తింటాం అని.
పు : అది కాదు వదినా రెస్టారెంట్ వైపుకు ఎప్పుడూ వెళ్ళలేదా అని?
నే: మేము ఎప్పుడూ కూరగాయలు తీసుకునేది స్వగృహ రెస్టారెంట్ పక్కనే. వారానికి రెండు సార్లు అటు పక్క గానే వెళతాం.
పుల్లమ్మ: సరే కానీ వదినా అన్నయ్యను మా ఆయనతో మాట్లాడ వద్దని చెప్పు. నేను వేలు చూసుకుని మల్లి వస్తా!
నేను: నీకు ఎప్పుడయినా రావాలనిపిస్తే వెంటనే మా ఇంటికి రా వదినా నువ్వు పాపం ఎప్పుడూ  ఇంట్లోనే ఉంటావు కదా!

ఒక వెటకారపు నవ్వు వేసి, అవును లోక జ్ఞానం నీ దగ్గరే తెలుసుకోవాలి అని వెళ్లి పోయింది.
ఏంటో ఈ జనం పాపం!