Thursday 28 July 2016

నాకోటి, నాన్నకోటి... మరి సోమికి?

సోమికి అంటే ఏమిటి అనేగా! మా అమ్మాయి భాషలో సోమి అంటే స్వామి/ దేవుడు అని అర్ధం. ఇంతకీ ఏమి అడిగినది అనేనా! చెప్తున్నాచెప్తున్నా!
ఉదయాన్నే లేచి ఇడ్లి స్టవ్ మీద పెట్టి పాపను లేపటం మొదలు పెట్టాను. తనని లేపి, పళ్ళు తోమించి స్నానం చేయించే సరికి వాళ్ళ నాన్నగారు కూడా మరో బాత్రూమ్ లో స్నానం ముగించుకుని బయటకు వచ్చారు. పాపకి బట్టలు వేసే లోపు ఆయనగారు పూజ సామానులు కడుగుకున్నారు. కడిగిన ఆ సామానులను తుడవడంలో మా పాప మా వారికి సహాయం చేస్తుంది. ఒకవేళ ఆయన చేయనివ్వకపోతే గొడవ చేస్తుంది. అది అలా దేవుని గదిలోనికి వెళ్ళగానే నేను తిరిగి వంటింట్లోకి వెళ్ళాను. ఇడ్లి  దించి పాలు పెట్టాను. ఇంతలో పాప సహాయం చేయటం అయిపొయింది. తిరిగి నాదగ్గరకు వచ్చింది. తనకి ఇడ్లి పెట్టి ఇచ్చాను. అమ్మా ఇంకొకటి ఇవ్వు అంది. అబ్బో ఈ రోజు రెండు తింటావా అనుకుంటూ అదే ప్లేటులో పెట్టబోతే వద్దు అని మరో ప్లేట్ తెచ్చింది. సరే బాగుంది అనుకుని పెట్టాను. మళ్ళీ  ఇంకొకటి అడిగింది. ముందు ఇది తిను మరొకటి పెడతాను అని చెప్పను. కాదు మూడో ప్లేట్ తెచ్చి నాముందు పెట్టి దీనిలో పెట్టు అంది. నాకు అర్ధం కాలేదు. నేను ఇప్పుడు తినను, ముందు నువ్వు తిను అని చెప్పేలోపల వాళ్ళ నాన్న సాయి చాలీసా మొదలు పెట్టారు.  అప్పుడు చెప్పింది ఆ మాట "నాకోటి, నాన్నకోటి... మరి సోమికి?". సరే అని ఒక ఇడ్లి ప్లేట్లో పెట్టి, పంచదార వేద్దామనుకున్నాను! మల్లి మరో మాట చెప్పింది. "నాన్న రోజు సోమికి పంచదార పెడతారు, ఈ రోజు చట్నీ పెడదాం! సోమికి చాలా ఇష్టం." అలా ఆ రోజు మా దేవునికి ఇడ్లి నైవేద్యం పెట్టాం! 

No comments:

Post a Comment