Tuesday 19 April 2016

స్నానం చేయకుండా "ఓం" పెట్టుకోవచ్చా!

మాపాప దానికి వచ్చే నెలలో 4వ పుట్టినరోజు వస్తుంది. ABCD లు రాస్తుంది, ఒంట్లు (అదేనండి తెలుగులో నెంబర్సు ) 100 రాస్తుంది.   ఇక పూజల విషయంలో మరీ అధ్బుతం. హనుమాన్ చాలీసా దగ్గరి నుండి సాయి చాలీసా, కనక ధారా స్తోత్రం అన్నీ చక్కగా చెప్తుంది.రోజూ మా వారు పూజ చేస్తున్నప్పుడు తను పక్కనే ఉంటుంది. ఆయనగారు ఏదయినా శ్లోకం తప్పు చదివినా, రోజూ చదివే వరుస తప్పించి మరోలా చదివినా అంతే పిర్యాదు చేస్తుంది. సాయి చాలీసా చక్కగా ఇద్దరూ కలిసి చదువుతారు. తరువాత హనుమాన్ చాలీసా తనే చదవాలి. పుస్తకం ఒడిలో పెట్టుకుని చదువుతూ పేజీలు  తిప్పుతుంది. చూసే వాళ్లకి నిజంగా పుస్తకం చూసి చదువుతుంది అనిపించేలా. తనకు ఇంకా తెలుగు చదవటం రాదు.
ఈరోజు పాప కొంచం ఆలస్యంగా లేచింది. అప్పటికి మావారి పూజ అయిపోయింది. కనుక తను గదిలో నుండి బయటకు రాగానే మావారు దేవునికి "ఓం" (నమస్కారాన్ని తను అలాగే అంటుంది)  పెట్టుకో వెళ్లి అని చెప్పారు. అయిష్టంగా మొహం పెట్టుకుని లోపలికి  వెళ్ళింది. బయటకు వచ్చి వాళ్ళ నాన్నగారితో "నాన్న! స్వామి నన్ను స్నానం చేసి 'ఓం' పెట్టుకో మన్నాడు. స్నానం చేయకుండా పెట్టుకోవచ్చా! నువ్వు అలాగే పెట్టుకున్నావా ఈ రోజు?"
తన మాటలు వింటున్న మాకు ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు. తరువాత తేరుకుని, తనని స్నానం చేయించాను.
ఇంతకీ తనకు ఏ స్వామి స్నానం చేయమని చెప్పాడో అడిగే సాహసం మేము చేయలేక పోయాం!

No comments:

Post a Comment