Monday, 7 March 2016

లోక జ్ఞానం

ఈ మధ్య నా  తేటలు లోక జ్ఞానం గురించి మా పక్కింటి పుల్లమ్మ పొగిడింది. అప్పటి నుండి మీ అందరితో నా సంతోషం పంచుకోవాలని  తొందరగా ఉంది. మీకు కూడా లోక జ్ఞానం గురించి ఏమయినా సందేహాలుంటే నన్ను అడగండి సుమా! ఇంతకీ ఆమె ఆ మాట ఎందుకు అందో చెప్తాను.
ఒక రోజు నేను నా పని చేసుకుని బట్టలు ఆరబెడుతుంటే పుల్లమ్మ వచ్చింది.
పుల్లమ్మ: ఏంటో వదినా ఈ మగవాళ్ళు వారం రోజులు ఇంట్లోనే ఉంటాం కదా మనం, వారానికి ఒక్కరోజు బయటకు తీసుకు వెళ్ళమంటే విసుక్కుంటారు.
నేను: ఎం వదినా! నిన్ను అన్నయ్య ఎక్కడికీ తీసుకువెళ్ళడా?
పుల్లమ్మ: ఎం తీసుకు వెళతాడులే, ఏదో నెలకి ఒకసారి, ఆదీ నీను బాగా గొడవ చేస్తే. ఎం వదినా అలా అడిగావ్? మీరు ఎప్పుడూ వెళుతూనే ఉంటారేమిటి?
నేను: మీ అన్నయ్య నన్ను కనీసం వారానికి 2 రోజులయినా బయటకు తీసుకు వెళతారు వదినా
పుల్లమ్మ: అబ్బ ఎంత అదృష్టమో నీది. అయితే ఈ చుట్టూ పక్కల చూడవలసినవి అన్నీ చూసే ఉంటారు కదా!
నేను: అబ్బే అదేం లేదు వదినా! ఎప్పుడు వెళ్ళినా ఒక్కదగ్గరకే తీసుకు వెళతారు.
పు: అదేంటి? ఒకే దగ్గరకు అన్నిసార్లు ఎందుకు వదినా?
నే: అలా  మళ్లీ మళ్లీ వెళితేనే అతనికి మనం గుర్తుంటామట. అప్పుడే మనకు చౌకగా ఇస్తాడట కూరగాయలు.
పు: కూరగాయలా?
నే: అవును కూరగాయలే! నువ్వు ఎం అనుకున్నావ్?
పు: అయితే మీరు వారానికి రెండు రోజులు బయటకు వెళ్ళేది కూరగాయల కోసమా!
నే: అవును. అంటే కూరగాయలే కాదు, అప్పుడప్పుడు పాల ప్యాకెట్ కూడా తెచ్చుకుంటాం!
పు: సరేలే. అయితే మీరిద్దరూ ఎక్కడికీ వెళ్ళరా?
నే: ఎందుకు వెళ్ళం? నెలకి ఒకసారి సరుకులు తెచ్చుకోవటానికి, పండగలప్పుడు బట్టలు కొనుక్కోవటానికి వెళతాం.
పు: బాగానే ఉంది. అయితే మీరు ఎప్పుడూ బయట తినలేదా?
నే: ఎందుకు తినం? ఆయనకి ఆరుబయట తినటం అంటే ఎంత ఇష్టమో!
పు: అదికాదు! మీరు బయటకి అంటే పార్కుకు అలా ఎప్పుడూ వెళ్ళరా?
నే: ఎందుకు వెళ్ళం? కార్తీక మాసంలో వన భోజనాలకి వెళతాం కదా!
పు: అంటే కానీ మీరు ఎప్పుడూ పార్కుకు కూడా వెల్ల లేదా?
నే\: ఊరుకో వదినా! నువ్వు మరీ, మా పెళ్లి అయిన కొత్తలో మన వెనుక సందులో ఒక పార్కు ఉంటుందే దానికి ఒకసారి తీసుకెళ్ళారు మీ అన్నయ్య.
పు: అబ్బో! ఇంకెక్కడికి వెళ్ళలేద?
నే: అయ్యయ్యో మరచిపోయాను. మొన్న మధ్య జూ పార్కు కు కూడా వెళ్ళాం. ఒక రోజంతా తిరిగాం.
పు: మరి ఆరోజు అక్కడ ఏమి తినలేదా?
నే: ఎందుకు తినలేదు! మీ అన్నయకు టైం కు తిండి ఉండాలి. ఆ రోజు పులిహోర తిన్నాం.
పు: మరి ఎలావుంది ఆరోజు పులిహోర?
నే: ఎలా వుంటుంది! బాగానే ఉంది. నేను ఎప్పుడు చేసినా పులిహోర మా వారు లొట్టలేసుకుంటూ తింటారు.
పు:  ఏంటి? ఆ పులిహోర నువ్వే చేశావా?
నే: అవును మేం ఎప్పుడయినా బయటకు వెళుతుంటే ఉదయానే లేచి వంట చేసి తీసుకెళతాం
పు: అయితే నువ్వు ఇప్పటి వరకు బయట తిననే లేదా!
నే : అదేంటి వదిన మల్లి అడుగుతావ్? ఇందాక చెప్పా కదా ఆరుబయట తింటాం అని.
పు : అది కాదు వదినా రెస్టారెంట్ వైపుకు ఎప్పుడూ వెళ్ళలేదా అని?
నే: మేము ఎప్పుడూ కూరగాయలు తీసుకునేది స్వగృహ రెస్టారెంట్ పక్కనే. వారానికి రెండు సార్లు అటు పక్క గానే వెళతాం.
పుల్లమ్మ: సరే కానీ వదినా అన్నయ్యను మా ఆయనతో మాట్లాడ వద్దని చెప్పు. నేను వేలు చూసుకుని మల్లి వస్తా!
నేను: నీకు ఎప్పుడయినా రావాలనిపిస్తే వెంటనే మా ఇంటికి రా వదినా నువ్వు పాపం ఎప్పుడూ  ఇంట్లోనే ఉంటావు కదా!

ఒక వెటకారపు నవ్వు వేసి, అవును లోక జ్ఞానం నీ దగ్గరే తెలుసుకోవాలి అని వెళ్లి పోయింది.
ఏంటో ఈ జనం పాపం! 

Saturday, 13 February 2016

సంక్రాంతి పిండి వంటల ప్రహసనం

ఏంటో ఈ మధ్య ఒక పని చేద్దాం అనుకుంటే మరొకటి అవుతుంది. మొన్న వడ్డానం కొందామని బయలు దేరానా! మా వారు అప్పుడే ఇంటికి వచ్చారు. సంక్రాంతికి చుట్టాలు వస్తున్నారు కదా! అని నా పుట్టినరోజున ఇవ్వ దలచుకున్న బహుమానాన్ని వాయిదా వేసారు. ఇంకేం చేస్తాం. సర్దుకు పోయాం అనుకోండి.
అసలు ఈ రోజు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఉదయం టమాటో ములక్కాయ కూర వండుదామని మొదలు పెడుతుంటే, మావారు వచ్చి ఏమి చేస్తున్నావ్ అని అడిగారు. నేన్ను చెప్పను. చెప్పగానే ఆయన నవ్వి, మొన్న చేసిన బూరె+ చలిమిడి+ అరిశె లాగ ఈ రోజుకూడా ఏమైనా ప్రయోగం చేస్తున్నావా అని అన్నారు.
సినిమాలలో చూపించినట్లు, ట్రింగ్, ట్రింగ్ మని జిలేబి చుట్టలు నా కళ్ళ ముందు తిరిగాయి.
సంక్రాంతి పండుగకు అందరు అరిసెలు చేసుకుంటారు కదా! నేను కూడా చేద్దామా అనుకున్నాను. ఇంతకు ముందు మా అమ్మ చేస్తున్నప్పుడు చుసిన, బాగా తిన్న అనుభవం ఉన్నది కానీ ఎప్పుడూ వండవలసిన సందర్భం రాలేదు. ఈసారి చేద్దామా అనుకున్నాను. మా అమ్మకు ఫోన్ చేస్తే, కొత్త కనుక బూరెలు వండుకో అని సలహా ఇచ్చింది. సరే అని ఒక కిలో బియ్యం నానబెట్టాను. రెండవ రోజు పిండి పట్టించమని మా వారిని పంపాను. ఆ మర వాళ్ళు బియ్యం ఆరబెట్టి తెమ్మని వెనక్కి పంపారు. ఇదేదో ముడి పడేలా లేదే అనుకుంటూనే ఆరబెట్టి పంపాను. ఆయన పిండి పట్టటం అవ్వగానే ఫోన్ చేసారు. మా నాన్న కూడా అలాగే చేసేవారు. మా అమ్మ పిండి ఆరకుండా పాకంలో కలపాలని అలా చేసేవారు అని నాకు తెలుసు. అదే ట్రైనింగ్ మా వారికి ఇచ్చాను మరి.
ఆయన అలా ఫోన్ చేయగానే నేను పాకం మొదలుపెట్టాను. ఆయన వచ్చారు. ఇక ఇంట్లో హడావిడి మొదలయింది. మా అమ్మ ఏమి చేసేది, ఎలా చేసేది అని గుర్తు చేసుకుంటూ చేస్తున్నాను. పాకం తిప్పుతున్న తెడ్డుతో కొంచెం పాకం తీసి నీళ్ళలో వేసి కావలసిన చిక్కదనం వచ్చిందా లేదా అని చూస్తున్నాను. సరిగ్గా పాకం వచ్చింది. ఇక పిండి కలపాలి అనుకునే సమయంలో యాలుకలు గుర్తు వచ్చాయి. పొడి సిద్ధంగానే ఉంది, దానిని అలా తీసి ఇలా కలిపి తరువాత పిండి కలిపాం. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. పెట్టిన అరకిలో పాకం ముదిరి చలిమిడి పాకం వచ్చింది. ఏమి చేయాలో తెలియ లేదు. పంచదార చలిమిడి తిన్నంత ఇష్టంగా బెల్లం చలిమిడి తినరు ఇంట్లో. మరి ఏమి చేయాలి? ఇంకో ఫోన్ అమ్మకు చేసాను. ఇంకొంచెం పాకం పట్టి కలుపు ఈసారి కొంచెం లేత పాకం అని చెప్పింది. సరే నల భీమ పాకం మళ్లీ మొదలు అనుకుని చేసాను. పాకం పట్టి కలిపాను.
నూనె లో వేద్దును కదా అరిసె వచ్చింది. సరే అని దానిలో నూనెను పిండటానికి ప్రయత్నిస్తే పిండి బయటకు వచ్చింది. ఆరిన తరువాత రుచి చుస్తే, బాగానే ఉంది కానీ అది అరిసె అంటే నాకే నమ్మబుద్ది కాలేదు. ఎందుకంటారా! దానిని తినే తప్పుడు వచ్చిన శబ్దం ఉంది కదా చక్రాలు (అదేనండి, కొన్ని ప్రాంతాలలో మురుకులు అంటారుకదా!) నమిలితే వచ్చే శబ్దం.
ఇంటికి అతిధులు వచ్చినప్పుడు పెట్టేందుకు మనసు ఒప్పుకోలేదు. ఏమి చేస్తాం, ఏదో అని మొదలు పెట్టి మరొకటి చేయబోయి ఇంకొకటి చేసానని మా వారు అప్పటి నుండి నన్ను ఆట పట్టిస్తున్నారు.

Sunday, 17 January 2016

Birthday gift

ఈ మధ్య మా అయన గారికి నాకు చిన్న గొడవ జరిగింది. అదేలెండి పీనాసి మొగుడు అని ఒక టపా రాసాను కదా! నేను అలా ఎప్పుడు చేసాను అని అడిగారు. నేను సరదాగా మొన్న చేసారు కదా అన్నాను. అంతే మొదలు.
సరే పుట్టినరోజు వస్తుంది కదా కొంచెం బంగారం కొనుక్కోనా అని అడిగాను. కోపంలో ఉన్నారేమో ఇప్పుడు కాదు అనేసారు. నేను వదులుతానా? ఏదో మాయ చేసి ఒప్పించాను. అసలే బంగారం రేటు కొంచెం తగ్గింది కదా!
అంతా అయ్యాక ఇప్పుడు నాకు ధర్మ సందేహం వచ్చింది. బంగారం ఐతే కొనాలి, కానీ ఏమి కొనాలి. మెదలోకి చైన్ కొంటే చైన్ కోసం గొంతులు తెగిపోతున్నాయి. బాబోయ్ వద్దు.
మరి ఉంగరం, చెవులకు దిద్దులు అంటే అబ్బే మరీ ఇంట చిన్నవా అని పించింది. అందుకే బాగా అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. అది మా వారికి చెప్పగానే ఇంకేముంది మొన్న ముగిసిన యుద్ధం మల్లి మొదలు.

న్యాయం మీరే చెప్పండి. బంగారం కొనుక్కో మన్నారు కదా మళ్లీ ఇలా మాట మార్చవచ్చా? ఎంత భార్య ఐతే మాత్రం మరీ ఇంట చులకనటండి. మాట ఇచ్చి తప్పటానికి? అందుకే యానకు తెలియకుండా బజారుకి వెళుతున్నాను. ష్... ! మీరు కూడా ఆయనకు చెప్పకండి.

ఆ... పిలిచారా! ఓహ్ , ఏమి కొనటానికి వెళుతున్నాను అని అడుగుతున్నారా! అదేనండి "వడ్డాణం"  ఒక సారి ఆర్డర్ ఇస్తే ఆయనే డబ్బులు కడతారు కదా!
అన్నట్లు చెప్పటం మరచి పోయాను, దొంగలు ఎవరైనా ఉన్నారో ఏంటో, మీరు కూడా ఎవరికీ చెప్పకండే. అసలే మంచి రోజులు కావు కదా!

Friday, 8 January 2016

పీనాసి మొగుడు

ఒక భార్య భర్తలు వేసవి కాలంలో ఎవరినో హాస్పిటల్లో కలుద్దామని బయలుదేరారు. కలిసి కొంచెం సేపు మాట్లాడి ఇంటికి బయలుదేరారు.
భార్య : ఏమండి! ఇందాక కూడా నడిపించారు. దాదాపు 20 min. నేను నడవలేను.
భర్త : అదికాదోయ్! నడిస్తే సరదాగా ఉంటుంది. ఆటో ఎక్కితే 50 రూపాయలు ఖర్చు ఎందుకు. అదిగో అక్కడి వరకు          నడిస్తే మనం ఎక్కాల్సిన bus వస్తుంది.
భార్య : సరే! నాకు దాహంగా ఉంది. juice తాగుదామా!
భర్త : సరే! కొంచెం ముందుకు వెళితే అక్కడ షాప్ ఉంది అక్కడ తాగుదాం లే. నడువు.

Juice shop దగ్గరలో
భర్త : juice చల్లగా ఉండదు కదా! cool drink ఐతే ఈ ఎండలో చల్లగా బాగుంటుంది. అదిగో ఇంకొంచెం ముందు షాప్ ఉంది అక్కడ తాగుదాం.
భార్య : (అయిష్టంగా) సరే

Cool drink shop దగ్గరలో
భర్త : ఐన ఈ మధ్య newsలో ఈ cool drinks లో ఏవో విష పదార్ధాలు కలుపుతున్నారు అని రాస్తున్నారు కదా! అమ్మో వద్దు మనం తాగవద్దు. అదిగో అక్కడ చూడు Bus stand దగ్గర  చెరుకు రసం అది తాగుదాం నడు.
భార్య : ...
చెరకురసం బండి దగ్గర
భర్త : వీళ్ళు ఈ చెరుకును రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఇక్కడ పిండుతారు. వాడు ఏనీళ్ళు వాడాడో ఏమో!
        ఐనా నువ్వు handbag తీసుకొస్తావ్ కదా, దానిలో ఒక్క water bottle పెట్టుకోవచ్చు కదా! అదిగో మనం                   ఎక్కాల్సిన బస్సు వచ్చింది. నీకు కావలసిన జ్యూస్ నువ్వే ఇంట్లో చెయ్. ఇద్దరం తాగుదాం!
భార్య : (మనసులో)ఇంత  పీనాసి మొగుడు నాకు ఎక్కడ దాపురించాడో!

మీకు ఏమి అనిపిస్తుంది? పాపం ఆ భార్య ఏమి అనుకుంటుందో మీరు చెప్పగలరా! 

Thursday, 24 December 2015

బుద్ధి ఉందా!

బుద్ధి ఉందా! అదేమీ ప్రశ్న. అది అందరికి ఉంటుంది . అలా అడిగావంటే మరి నేను కూడా అదే ప్రశ్న నిన్ను అడగాలి.  నా ఇష్టం అని నేనంటే బుద్ధి ఉందా! అని నన్ను అడుగుతార?  నాకు బుద్ధి  నా ఇష్టం అని చెపుతున్నా. లేకపోతే నేను కూడా మీలాగానే అయ్యో మనం ఇలా చేస్తే పక్కింటి వాళ్ళు ఏమయినా అనుకుంటారేమో, ఎదురింటి వాళ్ళు చూసి నవ్వుతారేమో అని చెప్పేదాన్ని. నేను నాలా ఉండాలనుకుంటున్నాను. అలా అనుకోవటం తప్పా.
అవును నిన్న రోడ్ మీద చెప్పులు లేకుండా నడిచాను. అందరూ  నన్ను విచిత్రం గా చూసారు. ఐతే, నాకు అలా వెళ్ళాలి అనిపించింది వెళ్ళాను. వాళ్ళు నవ్వుతారని నేను చెప్పులు వేసుకోవాలా? నాకాళ్ళు నా ఇష్టం. ఇంట్లోకి కాళ్ళు కడుక్కునే వెళతాను. అది నా ఇష్టం.
నవ్వుకునే వాళ్ళు మనం ఎలా ఉన్నా నవ్వుతారు. చక్కగా చీరకట్టి, బొట్టు, కాటుక,పువ్వులు పెట్టుకుని ఎప్పుడయినా కనిపిస్తే అబ్బో ఈ రోజు ఏదో ముంచుకు వచ్చేల ఉంది అంటారు. అలా కాకుండా చుడీదార్ వేసుకుని కనిపిస్తే కనీసం ఈ రోజయిన పద్దతిగా ఉండొచ్చు కదా అంటారు. అదికాదని జీన్స్, టాప్ వేసుకుని కనిపిస్తే బాబోయ్ ఇంకేముంది కొంపలు మునిగిపోయాయి అంటారు. అన్ని వింటాం. కానీ ఒక్క రోజు కూడా నేను ఏమి బట్టలు  వేసుకుంటే మీకు ఎందుకు అని అడగం. అది మీ పద్దతి. నన్ను అలా ఉండమనటం నాకు నచ్చలేదు. నా ఇష్టం.   వేసుకునే  బట్టల ను బట్టి సంస్కారం నిర్ణయించే హక్కు మీకు ఎక్కడ ఉంది అని ఒక్క ప్రశ్న అడగలేర? మీ వల్ల కాదు. అలాగే మీలా ఉండటం నా వల్ల కాదు. అందుకే నా ఇష్టం.    

నా ఇష్టం

అవునండి! నా ఇష్టం. అసలు నా ఇష్టం.
నేను ఏమైనా చెప్తా, ఏమైనా చేస్తా. నా ఇష్టం. తిండి తింటానో తిననో నా ఇష్టం. పని చేస్తానో చేయనో నా ఇష్టం. ఎప్పుడు పడుకుంటానో ఎప్పుడు లేస్తానో నా ఇష్టం.