Saturday, 13 February 2016

సంక్రాంతి పిండి వంటల ప్రహసనం

ఏంటో ఈ మధ్య ఒక పని చేద్దాం అనుకుంటే మరొకటి అవుతుంది. మొన్న వడ్డానం కొందామని బయలు దేరానా! మా వారు అప్పుడే ఇంటికి వచ్చారు. సంక్రాంతికి చుట్టాలు వస్తున్నారు కదా! అని నా పుట్టినరోజున ఇవ్వ దలచుకున్న బహుమానాన్ని వాయిదా వేసారు. ఇంకేం చేస్తాం. సర్దుకు పోయాం అనుకోండి.
అసలు ఈ రోజు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఉదయం టమాటో ములక్కాయ కూర వండుదామని మొదలు పెడుతుంటే, మావారు వచ్చి ఏమి చేస్తున్నావ్ అని అడిగారు. నేన్ను చెప్పను. చెప్పగానే ఆయన నవ్వి, మొన్న చేసిన బూరె+ చలిమిడి+ అరిశె లాగ ఈ రోజుకూడా ఏమైనా ప్రయోగం చేస్తున్నావా అని అన్నారు.
సినిమాలలో చూపించినట్లు, ట్రింగ్, ట్రింగ్ మని జిలేబి చుట్టలు నా కళ్ళ ముందు తిరిగాయి.
సంక్రాంతి పండుగకు అందరు అరిసెలు చేసుకుంటారు కదా! నేను కూడా చేద్దామా అనుకున్నాను. ఇంతకు ముందు మా అమ్మ చేస్తున్నప్పుడు చుసిన, బాగా తిన్న అనుభవం ఉన్నది కానీ ఎప్పుడూ వండవలసిన సందర్భం రాలేదు. ఈసారి చేద్దామా అనుకున్నాను. మా అమ్మకు ఫోన్ చేస్తే, కొత్త కనుక బూరెలు వండుకో అని సలహా ఇచ్చింది. సరే అని ఒక కిలో బియ్యం నానబెట్టాను. రెండవ రోజు పిండి పట్టించమని మా వారిని పంపాను. ఆ మర వాళ్ళు బియ్యం ఆరబెట్టి తెమ్మని వెనక్కి పంపారు. ఇదేదో ముడి పడేలా లేదే అనుకుంటూనే ఆరబెట్టి పంపాను. ఆయన పిండి పట్టటం అవ్వగానే ఫోన్ చేసారు. మా నాన్న కూడా అలాగే చేసేవారు. మా అమ్మ పిండి ఆరకుండా పాకంలో కలపాలని అలా చేసేవారు అని నాకు తెలుసు. అదే ట్రైనింగ్ మా వారికి ఇచ్చాను మరి.
ఆయన అలా ఫోన్ చేయగానే నేను పాకం మొదలుపెట్టాను. ఆయన వచ్చారు. ఇక ఇంట్లో హడావిడి మొదలయింది. మా అమ్మ ఏమి చేసేది, ఎలా చేసేది అని గుర్తు చేసుకుంటూ చేస్తున్నాను. పాకం తిప్పుతున్న తెడ్డుతో కొంచెం పాకం తీసి నీళ్ళలో వేసి కావలసిన చిక్కదనం వచ్చిందా లేదా అని చూస్తున్నాను. సరిగ్గా పాకం వచ్చింది. ఇక పిండి కలపాలి అనుకునే సమయంలో యాలుకలు గుర్తు వచ్చాయి. పొడి సిద్ధంగానే ఉంది, దానిని అలా తీసి ఇలా కలిపి తరువాత పిండి కలిపాం. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. పెట్టిన అరకిలో పాకం ముదిరి చలిమిడి పాకం వచ్చింది. ఏమి చేయాలో తెలియ లేదు. పంచదార చలిమిడి తిన్నంత ఇష్టంగా బెల్లం చలిమిడి తినరు ఇంట్లో. మరి ఏమి చేయాలి? ఇంకో ఫోన్ అమ్మకు చేసాను. ఇంకొంచెం పాకం పట్టి కలుపు ఈసారి కొంచెం లేత పాకం అని చెప్పింది. సరే నల భీమ పాకం మళ్లీ మొదలు అనుకుని చేసాను. పాకం పట్టి కలిపాను.
నూనె లో వేద్దును కదా అరిసె వచ్చింది. సరే అని దానిలో నూనెను పిండటానికి ప్రయత్నిస్తే పిండి బయటకు వచ్చింది. ఆరిన తరువాత రుచి చుస్తే, బాగానే ఉంది కానీ అది అరిసె అంటే నాకే నమ్మబుద్ది కాలేదు. ఎందుకంటారా! దానిని తినే తప్పుడు వచ్చిన శబ్దం ఉంది కదా చక్రాలు (అదేనండి, కొన్ని ప్రాంతాలలో మురుకులు అంటారుకదా!) నమిలితే వచ్చే శబ్దం.
ఇంటికి అతిధులు వచ్చినప్పుడు పెట్టేందుకు మనసు ఒప్పుకోలేదు. ఏమి చేస్తాం, ఏదో అని మొదలు పెట్టి మరొకటి చేయబోయి ఇంకొకటి చేసానని మా వారు అప్పటి నుండి నన్ను ఆట పట్టిస్తున్నారు.

No comments:

Post a Comment